సెప్టెంబర్ 4న ‘మా రాముడు అందరివాడు’ విడుదల.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్

సెప్టెంబర్ 4న ‘మా రాముడు అందరివాడు’ విడుదల.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్

Published on Sep 2, 2026 6:00 AM IST

​శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించిన చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ పతాకాలపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న 200కు పైగా థియేటర్లలో విడుదల కానుంది.

​ఈ సందర్భంగా సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను ముఖ్యమంత్రి పాత్ర పోషించానని, హీరో శ్రీరామ్ ద్విపాత్రాభినయంలో మెప్పించారని తెలిపారు. మంచి కథ, కథనాలతో వస్తున్న ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

​నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ.. మారెడుమిల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని, తాను ఇందులో ప్రతినాయకుడి పాత్ర కూడా పోషించానని చెప్పారు. సుమన్, తన మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని వివరించారు.

​తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని దర్శకుడు యద్దనపూడి మైకిల్ పేర్కొన్నారు. కంటెంట్ ఆధారంగా చిన్న సినిమాలను కూడా ప్రోత్సహించాలని హీరో శ్రీరామ్ కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వెంకట్ దుగ్గిరెడ్డి, శ్రీనివాస తేజ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు