ముఖ్య అంశాలు
- చైనాలో ఇద్దరు వ్యక్తులు సుమారు రూ.1 లక్ష బడ్జెట్‌తో రూపొందించిన ‘నియు లై’ అనే 86 నిమిషాల యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లకు పైగా వసూలు చేసింది.
- విడుదలైన తొలి పది రోజుల్లో తీవ్ర విమర్శలు, నెగెటివ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నప్పటికీ, అదే ప్రచారంగా మారి చిత్రానికి ప్రేక్షకాదరణ తెచ్చిపెట్టింది.
- విమర్శల నేపథ్యంలో ఆసక్తితో ప్రేక్షకులు థియేటర్లకు రావడంతో టికెట్ అమ్మకాలు ఊహించని రీతిలో పెరిగాయి.
భారీ బడ్జెట్ చిత్రాలు కొన్నిసార్లు నిరాశపరిస్తే, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు అరుదైన విజయాలను అందుకుంటుంటాయి. చైనాకు చెందిన ‘నియు లై’ (Niu Lai) అనే యానిమేషన్ చిత్రం ప్రస్తుతం అంతర్జాతీయ సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి సుమారు రూ.1 లక్ష బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ట్రోలింగ్‌తో పెరిగిన ఆసక్తి
ఆగస్టు 5న చైనాలో విడుదలైన ‘నియు లై’ తొలి పది రోజుల్లో కేవలం రూ.1.04 లక్షలు (7,700 యువాన్లు) మాత్రమే వసూలు చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 300 మంది మాత్రమే టికెట్లు తీసుకున్నారు. ముందస్తు ప్రచారాలు, అధికారిక ట్రైలర్ లేకుండా విడుదలైన ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లోకి వచ్చాక తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. గ్రాఫిక్స్ నాణ్యత లేవని, ‘ఏఐ కంటే నాసిరకంగా ఉంది’ అని నెటిజన్లు పెదవి విరిచారు.
అయితే, ఈ నెగెటివ్ ప్రచారమే సినిమాకు అనుకోని రీతిలో కలిసివచ్చింది. ‘అసలు చిత్రంలో ఏముంది?’ అని తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించడంతో థియేటర్లలో టికెట్ బుకింగ్స్ ఊపందుకున్నాయి. ప్రముఖ చైనా టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘మావోయాన్’ గణాంకాల ప్రకారం.. ఈ చిత్రం ఇప్పటివరకు 14.9 మిలియన్ యువాన్లకు పైగా (సుమారు రూ.20 కోట్లు) వసూలు చేసింది.
ఐదేళ్ల కష్టం.. ఇద్దరే రూపకర్తలు
ఓ చిన్న దూడ, స్కైలార్క్ పక్షి మధ్య అనుబంధం నేపథ్యంలో 86 నిమిషాల నిడివితో ఈ చిత్రం రూపొందింది. షిన్ యుమెంగ్, సన్ లిఫాంగ్ అనే ఇద్దరు వ్యక్తులు దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకత్వం, రచన, నిర్మాణం, వాయిస్ ఓవర్.. ఇలా అన్ని విభాగాల బాధ్యతలను ఆ ఇద్దరే నిర్వహించారు. భారీ బడ్జెట్‌తో వచ్చిన అంతర్జాతీయ చిత్రాల నడుమ బాక్సాఫీస్ ర్యాంకింగ్స్‌లో ఈ చిన్న చిత్రం నిలవడం సినీ వర్గాలను ఆకట్టుకుంటోంది.


