హీరోయిన్ కాజల్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటుంది. జూన్ 19, 1985లో పుట్టిన కాజల్ నేడు 35వ వసంతంలోకి అడుగు పెట్టింది. పట్టుమని పదేళ్లుగా కూడా హీరోయిన్ గా నిలవడం కష్టమైన ఈ రోజుల్లో కాజల్ ఏకంగా 16ఏళ్లుగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటుంది. తెలుగులో కాజల్ చిరు-కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య మూవీలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఐతే కాజల్ కెరీర్ ని మగధీర మూవీ మలుపు తిప్పింది. 2004లో ఓ హిందీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన కాజల్ మొదటి తెలుగు చిత్రం లక్ష్మీ కళ్యాణం. తేజా దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఆ మూవీ విజయం సాధించలేదు. రెండవ చిత్రం చందమామ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కాజల్ ఖాతాలో మూడు పరాజయాలు వచ్చి చేరాయి. దీనితో ఆమె కెరీర్ ముగిసింది అనుకుంటున్న తరుణంలో, రాజమౌళి మగధీర కోసం పిలిచి ఆఫర్ ఇచ్చాడు. చరణ్ హీరోగా వచ్చిన ఆ మూవీ ఇండస్ట్రీ హిట్. ఆ మూవీ తరువాత కాజల్ కెరీర్ జెట్ స్పీడ్ తో వెళ్ళింది.
