సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్, పివిపిలు నిర్మిస్తుండగా, ఊపిరి చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికానుకగా ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.
అయితే ఈ చిత్రం తరువాత మహేష్ తన 26వ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారు. ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాలనుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం నేడు మహేష్ బాబు నటించే 27వ చిత్రం కూడా కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. ఎప్పటినుండో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో మహేష్ బాబు ఒక సినిమా చేస్తున్నారు అనే వార్త షికారు చేస్తోంది.
ఇక నేటికీ ఆ వార్త నిజమైందని, సందీప్ చెప్పిన కథకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, సందీప్ రెడ్డి కూడా ఇక పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడని అంటున్నారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మెగా నిర్మాత అల్లు అరవింద్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నారట. చిత్రంలో ఏదైనా విషయం లేనిదే అరవింద్ ఒక పట్టాన చిత్రాన్ని ఓకే చేయరు. అందునా వారి గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఇప్పటివరకు బయటి స్టార్ హీరో ఎవరు కూడా నటించలేదు. మొట్టమొదటిసారి మహేష్ బాబుతో ఈ చిత్రాన్ని నిర్మించనున్న అరవింద్ కూడా కథ పై పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేసారని, ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా విడుదల చేయనున్నారని అంటున్నారు.
ప్రస్తుతం సినీవర్గాల్లో షికారు చేస్తున్న ఈ వార్త కనుక నిజమే అయితే, అటు సూపర్ స్టార్ అభిమానులకు, ఇటు మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.


