
ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపుతూ తెలుగు ప్రేక్షకులను, తన అభిమానులను మెప్పిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘మిర్చి’ ఫేం కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. జూన్ 27కి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయనున్నారు. ముందుగా ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. దానికోసమే అన్ని కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
కానీ తాజా సమాచారం ప్రకారం అనుకున్న తేదీ నుంచి ఈ సినిమాని వాయిదా వేసారు. అంతే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు తన బర్త్ డే కానుకగా ఈ సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ప్లాన్ చెయ్యడమే కాకుండా న్యూ రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసారు. మహేష్ బాబు బర్త్ డే ఆగష్టు 9న, ఈ బర్త్ డే కానుకగా రెండు రోజుల ముందే అనగా ఆగష్టు 7న సినిమాని రిలీజ్ చెయ్యడానికి డేట్ ని లాక్ చేసారు. దీని ప్రకారం రెండు రోజుల ముందు నుంచే మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఇరు రాష్ట్రాల్లోనూ మొదలవుతాయని తెలుస్తోంది. అలాగే ఆడియోని జూలై 18న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం అధికారికంగా తెలియజేసింది.
తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తానికి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు సరసన మొదటి సారి హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

