
తెలుగు సినిమా దర్శకుల రెండో సినిమా విషయంలో ఓ బలమైన సెంటిమెంట్ ఉంది. ద్వితీయ విజ్ఞంగా పిలుచుకునే ఈ సెంటిమెంట్ ప్రకారం మొదటి సినిమా బంపర్ హిట్ కొట్టిన దర్శకులు రెండో సినిమా విషయంలో విఫలమైపోతారనేది ఎప్పట్నుంచో ఉన్న ఓ సెంటిమెంట్. రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి కొందరు దర్శకులను పక్కనబెడితే పూరీ జగన్నాథ్, నందిని రెడ్డి, కరుణాకరన్, దశరథ్ తాజాగా సుధీర్ వర్మ.. ఇలా ద్వితీయ విజ్ఞాన్ని జయించలేకపోయిన దర్శకులెందరో!
కాగా మహేష్ సినిమాల విషయంలో మాత్రం ద్వితీయ విజ్ఞం అనే కాన్సెప్ట్ దర్శకులకు పనిచేయదని అభిమానుల కొత్త సెంటిమెంట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ (అతడు), శ్రీకాంత్ అడ్డాల (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) ఇలా తమ రెండో సినిమాను మహేష్‌తో చేసిన దర్శకులు రెండో ప్రయత్నంలోనూ మంచి విజయం సాధించారని అభిమానులు చెబుతున్నారు. ఆ క్రమంలోనే దర్శకుడు కొరటాల శివ రెండో సినిమాగా తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు’ కూడా ద్వితీయ విజ్ఞాన్ని జయిస్తుందని మహేష్ అభిమానుల సెంటిమెంట్.
మహేష్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. జూలై 17న సినిమాను విడుదల చేసేలా నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. మహేష్ సరసన శృతీ హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక అభిమానుల సెంటిమెంట్లనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ప్రేక్షకులు మెచ్చే సినిమా తీసినపుడు సెంటిమెంట్లతో సంబంధం లేకుండా ఆ సినిమా విజయం సాధిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.