
సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టే వారం రానే వచ్చేసింది. ‘శ్రీమంతుడు’గా ఎప్పుడెప్పుడు తమ హీరోను స్క్రీన్‌పై చూస్తామా అని ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఎదురుచూపులకు మరో రెండు రోజుల్లో తెరపడనుంది. మహేష్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఆగష్టు 7న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అంతటా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ కెరీర్లో మరో సూపర్ హిట్ సినిమా ఖాయమనే టాక్ మొదట్నుంచీ వినిపిస్తోంది.
ఊరిని దత్తత తీసుకోవడమనే సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమా అన్ని కమర్షియల్ అంశాలనూ నింపుకొని పర్ఫెక్ట్ సినిమాగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఒక శ్రీమంతుడి ఎమోషనల్ లైఫ్ జర్నీగా కొరటాల శివ తీర్చిదిద్దారు. ఒక సామాజిక అంశానికి ముడిపడి ఉన్న కథను కమర్షియల్‌గా చెప్పడంలో దర్శకుడు తీసుకున్న కేర్ తనకు బాగా నచ్చిందంటూ మహేష్ దర్శకుడికి కితాబు ఇచ్చారు. రీసెంట్గా ఇదే విషయమై మహేష్ మాట్లాడుతూ.. తనకు చెప్పిన దానికంటే శివ సినిమా చాలా బాగా తీశారని తెలిపారు. శ్రీమంతుడు ఔట్పుట్ విషయంలో మహేష్ హ్యాపీగా ఉండడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటూ సినిమాపై మంచి హైప్ తీసుకొస్తున్నారు. ఇక అన్నీ అనుకున్నట్లుగా జరిగి, మహేష్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటే అభిమానులకది పండగే!

