సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తాజా షెడ్యూల్ గురువారం నుండి పూణేలో ప్రారంభం కానుంది. రేపు మహేష్ బాబు పూణే పయనం కానున్నాడు. నవంబర్ 16 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఇప్పటివరకూ మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తొలిసారి నటించనున్నాడు. మహేష్ బాబు లేకుండా ప్రధాన తారాగణంపై దర్శకుడు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.
ఈ సినిమాకు పలు టైటిల్స్ ఖరారు చేసినట్టు మీడియాలో వార్తలు రాగా వాటిని దర్శకుడు ఖండించారు. ‘1 నేనొక్కడినే’ తర్వాత మరోసారి మహేష్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2015 వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


