
సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ పరిశ్రమకు పరిచయమై అనతికాలంలోనే సూపర్ స్టార్‌గా ఎదిగాడు మహేష్ బాబు. కృష్ణ పుట్టినరోజైన మే 31న తన సినిమాకు సంబంధించిన పోస్టర్ గానీ, టీజర్ గానీ విడుదల చేస్తూ అభిమానులకు గిఫ్ట్ ఇస్తుంటాడు మహేష్ బాబు. ఆరకంగా మహేష్ అభిమానులకు మే 31 పండగ రోజే. ఈ సారి కూడా అదే కోవలో మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’ టీజర్ విడుదల కానున్న విషయం తెలిసిందే!
ఇదిలా ఉంటే అదే రోజు శ్రీమంతుడు టీజర్‌తో పాటు అభిమాలకు మరో గిఫ్ట్ కూడా ఇవ్వనున్నాడు మహేష్. శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్లో ‘బ్రహ్మోత్సవం’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన లోగోను నేటి అర్థరాత్రి గానీ, రేపు ఉదయం గానీ విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి. పీవీపీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించనుంది. శ్రీమంతుడు పూర్తవగానే మహేష్ బ్రహ్మోత్సవం సినిమాను మొదలుపెట్టనున్నాడు.

