సురేష్ బాబునే మోసం చేశాడు..చివరికి జైలు పాలయ్యాడు

Published on Jun 23, 2021 1:02 am IST

టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు ఆర్థిక లావాదేవీల విషయంలో ఎంతో పకడ్బందీగా ఉంటారు. అనవసరంగా ఒక్క రూపాయి కూడ వృథా పోనివ్వని స్వభావం ఆయనది. అదే ఆయన్ను దశాబ్దాల తరబడి ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది. అలాంటి ఆయన్నే ఒకరు మోసం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కరోనా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో త్వరలో షూటింగ్స్ రీస్టార్ట్ కానున్నాయి. దీంతో నిర్మాణ సంస్థలన్నీ తమ ఆఫీస్ సిబ్బందికి వ్యాక్సిన్లు వేయిస్తున్నాయి. సురేష్ బాబు సైతం తన ఆఫీస్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించుకుని ఆ ప్రయత్నాల్లో ఉండగా నాగార్జున అనే వ్యక్తి సురేష్ బాబు కార్యాలయానికి టచ్లోకి వెళ్ళాడు.

తన వద్ద వ్యాక్సిన్స్ ఉన్నాయని నమ్మబలికాడు. అది నిజమేనని నమ్మిన సురేష్ బాబు ఆఫీస్ మేనేజర్ 500 వ్యాక్సిన్లకు గాను లక్ష రూపాయలు అతని బ్యాంక్ ఖాతాలో జమచేయడం జరిగింది. డబ్బులు అందుకున్న నాగార్జున మరుసటి రోజు నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడట. దీంతో మోసం జరిగిందని గ్రహించిన మేనేజర్ వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి ఆ మోసగాడిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. ఇతగాడు ఒక్క సురేష్ బాబునే కాదు ఇంకొంతమందిని కూడ ఇలాగే వ్యాక్సిన్ పేరుతో మోసం చేసాడట.

సంబంధిత సమాచారం :