పేదవాడికి జీవనాడిగా నిలుస్తోన్న ‘మనం సైతం’ !

పేదవాడికి జీవనాడిగా నిలుస్తోన్న ‘మనం సైతం’ !

Published on Jul 30, 2018 6:30 PM IST

manam sitham

అపదలో ఉన్న ఎందరినో ఆదుకుంటూ ఆపన్నులను అక్కున చేర్చుకుంటున్న సామాజిక సేవా సంస్థ ”మనం సైతం”. ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న ‘మనం సైతం’ రోజురోజుకు పేదవాడికి జీవనాడిగా నిలుస్తోంది. తాజాగా మరికొంత మంది పేదలకు ఆర్థిక సహాయం అందించి వారి జీవితాల్లో వెలుగును నింపింది. ఆదివారం ఫిలిం ఛాంబర్ లో జరిగిన మనం సైతం సేవా కార్యక్రమంలో రచయిత కోన వెంకట్, దర్శకుడు మారుతి, పాత్రికేయులు క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలోని వివిధ విభాగాల కార్మికులకు, వారి కుటుంబాలకు చెందిన గౌతమి, సాయి కార్తీక్, డ్రైవర్ ధర్మారావు, సునంద, దిలీప్ ఇలా తదితరులకు ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…మన కాళ్లకు తాకిందని సముద్రపు అలను చులకనగా చూడకూడదు. సహాయం కోసం మన దగ్గరకు వచ్చిన పేదవాడిని తక్కువగా చూడొద్దు. మొదట్లో పరిశ్రమలో ఎవరికైనా కష్టం వస్తే కొన్ని కారణాల వల్ల ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇవాళ మనకు కష్టమొస్తే ఆదుకునేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉందని మనం సైతం నిరూపించింది. ఈ సేవాకార్యక్రమాలు చూసి ఎందరో పెద్దలు మనం సైతంలో భాగమవుతున్నారు. నాతో ముఖ పరిచయం లేని వాళ్లు కూడా ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. మనం సైతంను మరింత విస్తృతమైన సేవా సంస్థగా మార్చేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నాం. పేదల చిరునవ్వు చూడటమే నా ఆశ అని కాదంబరి తెలిపారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ….మనం సైతం గురించి విన్నాను. కానీ ఇక్కడికి వచ్చాక…ఎంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారో అర్థమైంది. మనం సైతంకు నా వంతుగా లక్ష రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను. ఇంకా ఏదైనా అవసరం వస్తే మనం సైతం కోసం నా ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుందని మారుతి అన్నారు.

రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ.. ఇక్కడ నాకు ఎన్నో సమస్యలు వచ్చినా, చిత్ర పరిశ్రమ మీద ఉన్న ప్రేమ మాత్రం ఎప్పుడు తగ్గలేదు. ఏమైనా ఇక్కడే ఉండాలనిపించింది. అలాగే కాదంబరి కిరణ్ కూడా నటుడిగా కొనసాగుతున్నా అతనికి ఇంకేదో చేయాలి అనే తపన. ఆ తపనలో0చి మనం సైతం సేవా సంస్థను ప్రారంభించి సంతృప్తి పొందుతున్నాడు. నా వంతుగా లక్ష రూపాయలు సహాయం అందిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రపురి కాలనీ కమిటీ సభ్యుడు మహానందరెడ్డి 50 వేల రూపాయలు అందించగా, జూనియర్ యూనియన్ తరపున సెక్రటరీ అనిల్ లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు.

తాజా వార్తలు