విడుదల తేదీ : జూన్ 12, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : మనోజ్ బాజ్‌పాయ్, మధు, అదా శర్మ, నౌషాద్ మహ్మద్ కుంజు తదితరులు
దర్శకత్వం : చిన్మయ్ మాండ్లేకర్
సంగీతం : అమిత్ త్రివేది
నిర్మాత : విపుల్ అమృతలాల్ షా
ఛాయాగ్రహణం : విశాల్ సిన్హా
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫైనాన్షియల్ థ్రిల్లర్ ‘గవర్నర్’ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. 1991లో దేశం ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
కథ:
1991లో భారత దేశం ఎదుర్కొన్న భయంకరమైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (Balance of Payments) సంక్షోభం చుట్టూ ‘గవర్నర్’ కథ తిరుగుతుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా పడిపోవడంతో దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితికి చేరుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఎ. రమణన్ (మనోజ్ బాజ్‌పాయ్) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. మునిగిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే పెను బాధ్యతను ప్రభుత్వం ఆయన భుజాలపై పెడుతుంది. ఆ తర్వాత ఆయన ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని దేశాన్ని సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కించారు? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడానికి ప్రధాన కారణం ఎల్‌పీజీ (LPG – సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ). ఈ ఎల్‌పీజీ సంస్కరణలు దేశ రూపురేఖలను ఎలా మార్చాయో మనందరికీ తెలుసు. అయితే, అసలు వాటిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో చాలా మందికి తెలియదు. ఆనాటి భయంకరమైన పరిస్థితులను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది.
ఎలాంటి పొలిటికల్ అజెండా లేకుండా, వాస్తవంగా జరిగిన సంఘటనలను మాత్రమే తీసుకుని దర్శకుడు కథను చాలా సహజంగా నడిపించారు. ఆకాశాన్నంటిన చమురు ధరలు, ద్రవ్యోల్బణంతో అల్లాడిపోయిన జనం, దేశం సంక్షోభంలో ఉన్నా తమ పదవులను కాపాడుకోవాలని చూసే నాయకులు.. ఇలా ప్రతి అంశాన్ని ఎక్కడా బోర్ కొట్టించకుండా వాస్తవికతకు దగ్గరగా ఆవిష్కరించారు.
ఆర్బీఐ గవర్నర్‌గా మనోజ్ బాజ్‌పాయ్ నటన అద్భుతం. అడ్డంకులు ఎదురైనా చాలా ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించే తీరును ఈ జాతీయ అవార్డు గ్రహీత అద్భుతంగా పండించారు. ఆయన భార్యగా మధు, జర్నలిస్ట్‌గా అదా శర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు. డిప్యూటీ గవర్నర్ సి. రంగరాజన్‌గా నౌషాద్, ప్యూన్‌గా జయవంత్ వాడ్కర్ తమ వంతు సహకారం అందించారు.
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్‌లో కథనం కాస్త నెమ్మదిగా సాగడం ఈ సినిమాకు ప్రధాన మైనస్. అసలు కథలోకి వెళ్లడానికి డైరెక్టర్ ఎక్కువ సమయం తీసుకున్నారు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్‌లో కనిపించిన పరుగు ఫస్ట్ హాఫ్‌లో మిస్ అయ్యింది.
దీనికి తోడు, అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే ఒక ఉద్యోగికి సంబంధించిన సబ్‌ప్లాట్ మెయిన్ స్టోరీకి ఏమాత్రం సింక్ అవ్వలేదు. ఆ ట్రాక్ వల్ల ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడకపోగా, కథకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దాన్ని పూర్తిగా తీసేసి ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేది.
అలాగే, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ఏమాత్రం రుచించదు. ఇందులో ఎలాంటి పాప్‌కార్న్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. కాబట్టి, థియేటర్‌కి వెళ్లేముందే సరైన అంచనాలతో వెళ్లడం ముఖ్యం. కేవలం ఫైనాన్షియల్ థ్రిల్లర్స్, రియలిస్టిక్ డ్రామాలను ఇష్టపడే వారికి మాత్రమే ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది.
సాంకేతిక వర్గం:
సాంకేతికంగా చూస్తే, అమిత్ త్రివేది పాటలు, మన్నన్ షా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. విశాల్ సిన్హా కెమెరా పనితనం అద్భుతం. రాజేష్ చౌదరి ప్రొడక్షన్ డిజైన్ ప్రేక్షకులను నేరుగా 90వ దశకంలోకి తీసుకెళ్తుంది. ముఖేష్ ఛబ్రా కాస్టింగ్ సినిమాకు మరో బలం.
దర్శకుడు చిన్మయ్ మాండ్లేకర్ వాస్తవికతకు పెద్దపీట వేశారు. కీలక సమయాల్లో మానవ సంబంధాలను జోడిస్తూ కథను ఆసక్తికరంగా మలిచారు. తన చుట్టూ ఉన్న వ్యక్తుల స్ఫూర్తితోనే సమస్యలను హీరో పరిష్కరించే విధానాన్ని చక్కగా తెరకెక్కించారు.
తీర్పు :
మొత్తం మీద చూస్తే.. 1990ల్లో భారత్ ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభాన్ని నిజాయితీగా చూపించిన ఫైనాన్షియల్ థ్రిల్లర్ ఈ ‘గవర్నర్’. మనోజ్ బాజ్‌పాయ్ అద్భుత నటన, సహజమైన కథనం ఈ సినిమాకు ప్రధాన బలం. అయితే ఫస్ట్ హాఫ్‌లో నెమ్మదించిన కథనం, కమర్షియల్ హంగులు లేకపోవడం కొంత మైనస్ అని చెప్పాలి. వాస్తవిక కథలను, ఫైనాన్షియల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. కానీ, రెగ్యులర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆశించే వారు మాత్రం ఈ సినిమాకు దూరంగా ఉండటం బెటర్.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


