సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి వివరించాల్సిన పనే లేదు. రజినీ పేరు వింటే ముందుగా గుర్తిచ్చేది జనాల్లో ఆయనకున్న పేరు ప్రతిష్టలే. తమిళనాట ఆయన్ను దేవుడిలా చూస్తారు అభిమానులు. ఆయన నటనకు, ఛరీష్మాకు ఎన్నో అవార్డులు దాసోహం అన్నాయి. 2000లో పద్మభూషణ్, 2006లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్న రజినీ తాజాగా దాదా సాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆయనను ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.
ఈ సందర్బంగా రజినీ అభిమానులు, సినీ ప్రముఖులు రజినీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజానికి ఇది సంతోషించదగిన విషయమే. అవార్డును అందుకోవడానికి రజినీ నూటికి నూరు శాతం అర్హులు కూడ. అయితే అవార్డు ప్రకటించిన సమయమే తీవ్ర విమర్శలకు తావిస్తోంది. త్వరలో తమిళనాట ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో రజినీకి అవార్డ్ ప్రకటించడం వెనుక ఆయన అభిమానులను ప్రభావితం చేయాలనే ఉద్దేశ్యం ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంలో ప్రకటించిన అవార్డే అంటున్నాయి రాజకీయ పార్టీలు కొన్ని.


