మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మారెమ్మ’. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఒక గ్రామంలో అకస్మాత్తుగా ప్రబలిన వింత వ్యాధి కారణంగా మనుషులు, పశువులు మృత్యువాత పడటం.. ఆ గండం నుండి గట్టెక్కించాలని గ్రామ దేవత ‘మారెమ్మ తల్లి’ని గ్రామస్థులు వేడుకోవడం మనకు టీజర్‌లో చూపెట్టారు.
గ్రామ దేవతకు మొక్కుకున్న దున్నపోతు కనిపించకుండా పోవడంతో ఆ గ్రామంలో చోటు చేసుకునే పరిణామాలు ఈ చిత్ర కథగా మనకు చూపెట్టనున్నారు. మాధవ్ తన మొదటి సినిమాతోనే మాస్ లుక్‌లో, ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా పక్కా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పర్ఫార్మెన్స్ మెప్పించేలా ఉంది.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తుండగా వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, రూప లక్ష్మి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


