“దండోరా” చిత్రానికి గానూ ప్రముఖ సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘గద్దర్ అవార్డు’తో సత్కరించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా (బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్) ఎంపికైన ఆయన.. ఈ సినిమాలో అందించిన నేపథ్య సంగీతం, ముఖ్యంగా ‘దండోరా’ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మార్క్ కె రాబిన్ ‘అ!’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అనతికాలంలోనే ‘మల్లేశం’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాంబీ రెడ్డి’ లాంటి విజయవంతమైన చిత్రాలతో పాటు సుమారు 20కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. బాలీవుడ్‌లో “8AM Metro” సినిమా ద్వారా అరంగేట్రం చేసి ఐరా (IRA) అవార్డును సైతం అందుకున్నారు. గతంలో సైమా, మిర్చి మ్యూజిక్ లాంటి పలు పురస్కారాలు గెలుచుకున్న ఆయన ఖాతాలో ఇప్పుడు గద్దర్ అవార్డు కూడా చేరింది.
ఈ సందర్భంగా మార్క్ స్పందిస్తూ.. చిన్నప్పటి నుంచి గద్దర్ పాటలు వింటూ పెరిగానని, ఆయన పేరు మీద ఉన్న అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ అవకాశం ఇచ్చిన ‘దండోరా’ దర్శకుడు మురళీకాంత్, నిర్మాత రవీంద్ర బెనర్జీకి, గాయనీగాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


