నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఆడియోని డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి వేదికని సిద్దం చేస్తున్నారు. అమరావతిలో జరుగుతున్నా మొట్ట మొదటి సినీ వేడుక ఇది, కావున దీనిని అత్యంత వైభవంగా చేసి అందరినీ అమరావతి వైపు ఆకర్షించాలని బాలకృష్ణ ప్లాన్ చేసాడు. అనుకున్నట్టుగానే బాలయ్య ఈ వేడుకకి భారీ వేదికని సిద్దం చేస్తున్నాడు.
అంతే కాకుండా ఈ ఒక్క ఆడియో ఫంక్షన్ కి ఓ భారీ రాజకీయ సభకి వచ్చినట్లు ఇరు రాష్ట్రాల నుంచి సుమారు లక్షమందికి పైగా అభిమానులను ఇన్వైట్ చేయనున్నారట. అమరావతిలో జరిగే ఈ మొదటి సినీ వేడుక కనీ వినీ ఎరుగని రీతిలో ఉండడమే కాకుండా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అందుకే లక్షమందికి పైగా ఈ వేడుకకి హాజరయ్యేలా, వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేలా బాలయ్య వేదికని సిద్దం చేయిస్తున్నాడట. ఈ వేడుకకి పలువురు రాజకీయ నేతలు కూడా హాజరు కానున్నారు.
బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా ఎరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.


