ప్రముఖ బాలనటుడు, హీరో మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘నీలకంఠ’. ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్లపై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 2న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఐటీ రంగం నుంచి సినిమాపై ఉన్న ప్యాషన్‌తో నిర్మాణంలోకి వచ్చానని, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా రాజీపడకుండా సినిమా పూర్తి చేశామని తెలిపారు. దర్శకుడు రాకేష్ మాధవన్ మాట్లాడుతూ, ఇది తన తొలి సినిమా అయినప్పటికీ క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గలేదని, ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. “నేను తెలుగువాడినే. కంటెంట్, ఎమోషన్ ఉన్న కథలనే ఎంచుకుంటాను. చేయని తప్పుకు ఊరంతా నింద వేస్తే, ఒక వ్యక్తి దాన్ని ఎలా ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడనేదే ఈ సినిమా కథ. ఇందులో యాక్షన్, ఎమోషన్స్ ప్రేక్షకులకు నచ్చుతాయి” అని పేర్కొన్నారు. బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేసింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


