
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న నయనతార, సెకండ్ ఇన్నింగ్స్‌లో పలు లేడీ ఓరియంటడ్ సినిమాలతోనూ మెప్పిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నయనతార హీరోయిన్‌గా తమిళంలో ‘మాయ’ పేరుతో ఓ హర్రర్ డ్రామా రూపొందింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ‘మయూరి’ పేరుతో డబ్ చేశారు. మంచి అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా వినాయక చవితి రోజున పెద్ద ఎత్తున విడుదలైంది.
చాలాకాలం తర్వాత పూర్తి హర్రర్ డ్రామా సినిమా రావడంతో హర్రర్ జానర్ అభిమానులు ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి కనబరచారు. మొదటి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మొదటి వారాంతం ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక తెలుగులో ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా, ఇక్కడా మంచి కలెక్షన్స్ సాధించడం విశేషంగా కనిపించింది.
ఇక పోస్ట్ రిలీజ్ బిజినెస్ పరంగానూ మయూరి సత్తా చాటుతోంది. ప్రముఖ తెలుగు టీవీ చానల్ జెమినీ, ఈ సినిమా సాటిలైట్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఒక తమిళ సినిమా, ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగులో ఇంత పెద్ద విజయం సాధించడం విశేషంగా మారింది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తమిళంలో ‘మాయ’ పేరుతో విడుదలైన ఈ సినిమా అక్కడా సూపర్ కలెక్షన్స్ కొల్లగొడుతోంది.