మెగాస్టార్ చిరంజీవి.. సగటు తెలుగు సినీ అభిమానికి పరిచయమక్కర్లేని పేరు. మూడు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో టాప్ పొజిషన్ సొంతం చేసుకొని నిలబడ్డ స్టార్. గత కొన్నేళ్ళుగా రాజకీయ కార్యక్రమాలతో బిజీ అయి సినిమాల్ని పక్కన పెట్టిన చిరు, ప్రస్తుతం మళ్ళీ 150వ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇదలా ఉంచితే.. నేడు (ఆగష్టూ 22) చిరంజీవి తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ 60వ జన్మదినోత్సవ వేడుకలను గ్రాండ్గా జరిపేందుకు మెగా ఫ్యామిలో అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం నుంచే అభిమానుల సంబరాలు మొదలయ్యాయి. నిన్న చిరంజీవి పాల్గొనగా అభిమానుల సమక్షంలో పెద్ద ఎత్తున చిరు పుట్టినరోజు వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ సాయంత్రం పెద్ద ఎత్తున పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా చిరు పుట్టినరోజు వేడుకలు హైద్రాబాద్లోని పార్క్ హాయత్లో జరగనుంది. పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరుకానున్న ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. అతిథుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.


