ప్రస్తుతం ముగ్గురు మెగా హీరోలు తమ తదుపరి సినిమా దర్శకత్వ భాద్యతలు ఎవరికీ అప్పగించాలి అనే విషయంలో తీవ్రంగా ఆలోచిస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురూ ఓ నిర్ణయం తీసుకోలేక ఊగిసలాడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా తెరకెక్కడానికి రంగం సిద్దమవుతుంది. ఇది పాత వార్తే. అదిగో పులి వచ్చేస్తుంది అని చెప్పడం మినహా స్క్రిప్ట్, దర్శకుడు తదితర అంశాలలో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఇండస్ట్రీలో దాదాపు అందరు రచయితలు తమ కథలను వినిపించారు, అందులో రెండిటిని మెగా కాంపౌండ్ ఓకే చేసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. తర్వాత దర్శకుడిని ఎంపిక చేస్తారు. వివి వినాయక్, కృష్ణవంశి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరుల పేర్లు వినబడుతున్నాయి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
‘గబ్బర్ సింగ్’తో రికార్డుల దుమ్ము దులిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ సినిమాకు సీక్వెల్ చేస్తానని ప్రకటించారు. ‘రచ్చ’ తర్వాత రెండేళ్ళ నుండి మరో సినిమా చేయకుండా సంపత్ నంది పవన్ చుట్టూ తిరుగుతున్నాడు. చాలా సార్లు కథా చర్చలు జరిగాయి. అనూహ్యంగా సంపత్ నందిని పక్కకు తప్పించారు అని వార్తలు వస్తున్నాయి. పవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తారని ఒక రోజు, ‘పవర్’ ఫేం బాబీ రేసులో ఉన్నాడు అంటూ మరొక రోజు వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు మాత్రం నోరు మెదపడం లేదు.
‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత రామ్ చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మీడియాకు ఓ ప్రెస్ నోట్ కూడా పంపారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. దర్శకుడిగా శ్రీవాస్ పేరు వినిపిస్తుంది. అధికారికంగా ప్రకటించలేదు. కోన వెంకట్ – గోపి మోహన్ కథను అందిస్తున్నారు. మరోవైపు మంచి స్క్రిప్ట్ తో వస్తే శ్రీను వైట్లతో వర్క్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చరణ్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.
స్క్రిప్ట్, అభిమానుల అంచనాలు, గత సినిమా ఫలితాలు ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న మెగా హీరోలు త్వరగా ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఒకేసారి మెగా కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలు ఓ విషయంలో ఆలోచించడం యాదృశ్చికం.


