వైజాగ్, ఉత్తరాంధ్ర హుదూద్ బాధితులను ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు వచ్చి చేస్తున్న కార్యక్రమం ‘మేము సైతం’. ఈ వేడుకని నవంబర్ 9న చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం. కానీ చిత్ర పరిశ్రమ ముందుగా అనుకున్న దానికంటే చాలా గ్రాండ్ గా చాలా మంది ప్రముఖులను ఆహ్వానించి చేయాలనుకోవడంతో ఈ వేడుకని నవంబర్ 7 నుంచి వాయిదా వేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం నవంబర్ 23 లేదా నవంబర్ 30వ తేదీలలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
అందరి వీలును చూసుకొని త్వరలోనే ఈ రెండు తేదీల్లో ఏదో ఒకదానిని ఫిక్స్ చేస్తారు.సుమారు 13 గంటల పాటు జరిగే ఈ ప్రోగ్రాం ని కంటిన్యూగా ఓ టీవీ చానల్ లో లైవ్ ఇవ్వనున్నారు. టాలీవుడ్ లోని అందరు స్టార్స్ హాజరు కావడమే కాకుండా, వారు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి ప్రేక్షకులను అలరించనున్నారు. ఇండస్ట్రీలోని ప్రముఖులు హీరోలు అంతా కొన్ని టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆ రోజు ప్రోగ్రామ్స్ చేయనున్నారు. ఈ వేడుకకి తెలుగు హీరోలే కాకుండా తమిళ హీరోలైన సూర్య, కార్తీ కూడా హాజరై పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు.


