మిడిల్ ఈస్ట్ (Middle East) అగ్నిగుండంగా మారుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు.. ఇరాన్ మరోవైపు భీకర దాడులకు దిగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. తాజాగా ఇరాన్‌లోని చబహార్ ఫ్రీ ట్రేడ్ జోన్ (Chabahar FTZ) వద్ద ఉన్న మిలిటరీ స్థావరాలపై అమెరికా యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. దీనికి ప్రతీకారంగా జరుగుతున్న దాడులతో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో మిస్సైల్ కలకలం రేగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. ప్రతిరోజూ దాదాపు 1,200 ఫ్లైట్స్ రాకపోకలు సాగించే ఈ ఎయిర్‌పోర్ట్ బంద్ కావడంతో, ఏకంగా 24 గంటల్లోనే యూఏఈకి సుమారు 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15 వేల కోట్లు) నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ మరింత దిగజారుతుందని ఎక్సాన్ మొబైల్, షెవ్రాన్ వంటి దిగ్గజ ఆయిల్ కంపెనీల సీఈఓలు వైట్ హౌస్ అధికారులను హెచ్చరించారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు సెంచరీ కొట్టేశాయి. బ్యారెల్ ధర 100 డాలర్లు దాటడంతో కంగారు మొదలైంది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) చుట్టూ నెలకొన్న అస్థిరత కారణంగా సప్లై చైన్ దెబ్బతిని రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు ఈ సంక్షోభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మిత్రదేశాల నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు భద్రత కల్పించేందుకు తమ యుద్ధనౌకలను పంపాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనను బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు సున్నితంగా తిరస్కరించాయి. తాము ఆ ప్రాంతంలో సైనిక బలగాలను మోహరించబోమని ఆస్ట్రేలియా, జపాన్ తేల్చి చెప్పగా.. కేవలం రక్షణాత్మక చర్యలకే పరిమితం అవుతామని బ్రిటన్, ఫ్రాన్స్ స్పష్టం చేశాయి. చైనా, సౌత్ కొరియా కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మొత్తానికి ఇరాన్‌ను దెబ్బతీయాలని చూస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌లకు మిత్రదేశాల మద్దతు కరువవడంతో ఈ యుద్ధం ఇంకెంత దూరం వెళ్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


