ముఖ్య అంశాలు
- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 19న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- ఈ సినిమాలో తన పాత్ర పేరు శ్లోక అని, కథ వినకుండానే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో సినిమా ఒప్పుకున్నానని రాశీ ఖన్నా తెలిపారు.
- గబ్బర్ సింగ్ తరహాలో ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని, పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
‘గబ్బర్ సింగ్’ మ్యాజిక్ మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద రిపీట్ కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలు అందిస్తుండగా, ఎస్. తమన్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ పెంచేయగా.. ఉగాది కానుకగా మార్చి 19న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ రాశీ ఖన్నా మీడియాతో ముచ్చటిస్తూ ఉస్తాద్ సెట్స్ లోని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, ఇందులో వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూస్తారని ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే అప్‌డేట్ ఇచ్చారు.
పవన్ కోసం కథ కూడా వినలేదు.. సెట్‌లో ఆయన సింప్లిసిటీకి ఫిదా!
పవన్ కళ్యాణ్ సినిమా అనగానే తాను కథ కూడా వినకుండానే ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో వెంటనే ఓకే చెప్పేశానని రాశీ ఖన్నా తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కన్నానని, ఉస్తాద్‌తో ఆ కల నెరవేరిందన్నారు. ఈ చిత్రంలో తను మోడరన్ అమ్మాయి ‘శ్లోక’ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. తన పాత్రకు ఒక మాస్ సాంగ్ కూడా ఉందని, డ్యాన్స్ అంటే ప్రాణం కాబట్టి ఆ సాంగ్ షూట్ బాగా ఎంజాయ్ చేశానని చెప్పారు. పవన్ గారితో పని చేయడం గొప్ప అనుభూతినిచ్చిందని, ఆయన ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ చాలా సింపుల్‌గా ఉంటారని ఆమె ప్రశంసించారు. “మొదటి రోజు సెట్‌లో.. మీరు ముందే నటి కావాలనుకున్నారా? అని పవన్ గారు అడిగారు. నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని చెప్పగానే.. ప్రజా సేవ చేయమని ఆయన సూచించారు” అని రాశీ ఖన్నా గుర్తు చేసుకున్నారు. పవన్ ప్రతి మాటలో విలువ ఉంటుందని, ఆయన ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారని పేర్కొన్నారు.
హరీష్ శంకర్ ప్లానింగ్ వేరు..
దర్శకుడు హరీష్ శంకర్‌కు మాస్ పల్స్ బాగా తెలుసని, ఆయన పనితీరు ఆశ్చర్యపరుస్తుందని ఆమె కితాబిచ్చారు. సాధారణంగా 120 రోజులు పట్టే షూటింగ్‌ను తన పక్కా ప్లానింగ్‌తో కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేశారని చెప్పారు. సెట్‌లోనే అప్పటికప్పుడు పంచ్ డైలాగ్స్ రాసివ్వడం ఆయన స్టైల్ అని పేర్కొన్నారు.
ఇక మరో హీరోయిన్ శ్రీలీలతో స్క్రీన్ స్పేస్ గురించి మాట్లాడుతూ.. తమ ఇద్దరికీ కాంబినేషన్ సీన్స్ లేవని, ఎవరి పాత్రకు తగ్గ ప్రాధాన్యత వారికి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి, ఆయన డేట్స్ కు తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతూ కొన్నిసార్లు 24 గంటల పాటు పనిచేశానని రాశీ తెలిపారు. సినిమా కోసం ప్రాణం పెట్టే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో పని చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందని, వారు దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారని చెప్పారు. ఇక తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో ఒక సినిమాతో పాటు, ‘ఫర్జీ 2’, అమెజాన్ ప్రైమ్ పంజాబీ వెబ్ సిరీస్, తమిళ్‌లో ‘రౌడీ అండ్ కో’ చేస్తున్నట్లు రాశీ ఖన్నా తన ఫ్యూచర్ లైనప్ వెల్లడించారు.


