ఏక్మా సాయి కుమార్ దర్శకత్వంలో శ్రీనాథ్, హరిత జంటగా శ్రీ మల్లికార్జున మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రం మిర్రర్. సీ యువర్ సెల్ఫ్ అనేది చిత్ర ఉప శీర్షిక.సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో తెరకెక్కింది ఈ చిత్రం . ఇక ఈ చిత్ర ట్రైలర్ ను టీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు విడుదల చేశారు. అనంతరం అందరికీ నచ్చే సినిమాను చేయాలని ఆయన సూచించి తన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం దర్శకుడు ఏక్మా సాయి కుమార్ మాట్లాడుతూ. ఒక ఊరిలో వరుసగా యువతీ యువకుల ఆత్మహత్యలు జరుగుతుంటాయి. వాటికి కారణం ఏంటని అన్వేషిస్తూ సాగే కథాంశమిది. అందరిలో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే కొందరు అసాంఘిక శక్తుల అసలు రూపాన్ని బయటపెడుతుందీ సినిమా. వాణిజ్య విలువలున్నా…ఎక్కడా అశ్లీలత కనిపించకుండా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సినిమాను రూపొందించాం. ప్రస్తుతం మిర్రర్ సినిమా సెన్సార్ మినహా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ పూర్తి చేసి త్వరలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. సినిమాను మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం అని అన్నారు.


