ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, ప్రముఖ నటి లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త కుటుంబ కథా చిత్రం ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ బుధవారం(మే 27) ఘనంగా జరిగింది. టైటిల్‌కు తగ్గట్టుగానే, ఈ చిత్రం వెంకటరమణ అనే ఒక మధ్యతరగతి వ్యక్తి కథాంశంతో రూపొందింది. కుటుంబ బాధ్యతలను మోస్తూ.. ఇంటి అద్దెలు, తల్లిదండ్రుల హాస్పిటల్ ఖర్చులు, అప్పుల ఒత్తిడి మధ్య జీవితాన్ని వెళ్లదీయడానికి అతడు పడే కష్టాలను ఈ సినిమాలో చూపించనున్నారు.
ఇలాంటి ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, హీరో వెంకటరమణ మాత్రం తన ఇష్టదైవమైన వేంకటేశ్వరస్వామిని నమ్మడం, నిరంతరం ప్రార్థించడం మానడు. ఈ క్రమంలో తన పరమ భక్తుడిని ఆదుకోవడానికి ఆ గోవిందుడే స్వయంగా భూమిపైకి వస్తాడు. ఈ చిత్రంలో భగవంతుని పాత్రలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటిస్తుండటం విశేషం. ముఖ్యంగా మిడిల్ క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఒక చక్కటి వినోదాత్మక, భక్తిరస చిత్రంగా దీనిని మలిచినట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.
బ్లూ. జె క్రియేషన్స్ బ్యానర్‌పై జికె మరియు సిఎన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్, ఆలీ, రఘుబాబు, వెన్నెల కిషోర్, పృథ్వి, మురళీధర్ గౌడ్, ప్రభాస్ శ్రీను, ధన్‌రాజ్, అపూర్వ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
