
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ ఏడాది ‘బాహుబలి’, ‘సైజ్ జీరో’ లాంటి సినిమాలకు మంచి సంగీతం ఇచ్చి ఆయన అభిమానుల్నే కాక సంగీత ప్రియుల్ని బాగా అలరించిన ఆయన, త్వరలో లైవ్ కాన్సర్ట్స్‌తో అమెరికాలో ఉండే శ్రోతలను మెప్పించేందుకు సిద్ధమయ్యారు. జనవరి నెలలో కీరవాణి నిర్వహించే ఈ లైవ్ ఈవెంట్స్ జరగనున్నాయి.
రచయిత అనంత శ్రీరామ్, గాయకులు గీతా మాధురి, రేవంత్ తదితరులు కీరవాణి టీమ్‌లో ఉన్నారు. జనవరి 13 నుంచి అమెరికాలోని పలు ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున ఈ లైవ్ ఈవెంట్స్ జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఈ ఈవెంట్స్ నిర్వాహకులు ఇప్పట్నుంచే మొదలుపెట్టేశారు. ఇక సినిమాల్లో ఆయన పాటలు వినడమే ఎంతో హాయిగా భావించే కీరవాణి అభిమానులు నేరుగా లైవ్ ఈవెంట్‌తో రానుండడంతో ఈ ఈవెంట్ కోసం ఇప్పట్నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు.