భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ దుబాయ్ షెడ్యూల్లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. సినిమా బడ్జెట్ నుండి ఎక్కువ భాగం ఈ షెడ్యూల్ కోసమే కేటాయించారు. ‘ట్రాన్స్ఫార్మర్స్’ లాంటి హాలీవుడ్ సినిమాలకి స్టంట్స్ డిజైన్ చేసిన కెన్నీ బేట్స్ ఈ సినిమాకి కూడ స్టంట్స్ డిజైన్ చేస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ సన్నివేశాలకి సంబదించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బయటికొచ్చాయి. వాటిలో లావిష్ లుక్ లో ఉన్న ప్రభాస్ స్పోర్ట్స్ బైక్ పై చేస్తున్న యాక్షన్ స్టంట్స్ తాలూకు ఫోటోలున్నాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఛేజింగ్ సీక్వెన్స్ కోసం ఖరీదైన కార్లు, బైకులు, భారీ వోల్వో బస్సులను వినియోగిస్తున్నారు.
సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సుమారు రూ.150 కోట్లకు పైగానే బడ్జెట్ వెచ్చించి నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శ్రద్దా కపూర్ నటిస్తోంది.


