సతీష్ బాబు, మెరీనా జంటగా రాజు కుంపట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. కామెడీ ఎంటర్టైనర్ అనేది ఉపశీర్షిక. రిషి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జనార్ధన్ మందుముల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయిన గొట్టిముక్కల పద్మారావు ఫస్ట్ లుక్ టీజర్ ను ఆవిష్కరించారు.
అందమైన ప్రేమలో దాగి ఉన్న రొమాన్స్, అలాగే ప్రేమ ముసుగులో దాగి ఉన్న ఫైనాన్స్ అనే కధాంశంతో మా చిత్రం రూపొందింది. ఈ చిత్రం ప్రారంభం కావడానికి ముఖ్య కారణం రవి మేకల. నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. జాన్ సంగీతం, మురళి సినిమాటోగ్రఫీ హైలైట్ అవుతాయి. నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు అని దర్శకుడు రాజు కుంపట్ల అన్నారు.
టైటిల్ వినగానే బూతు చిత్రం అని అనుకుంటారు. ఇదొక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్. ‘జబర్దస్త్’ టీం సభ్యులు చేసిన కామెడీ అందరిని అలరిస్తుంది అని రవి మేకల అన్నారు. రెండు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశాం. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత జనార్ధన్ తెలిపారు.


