విడుదల తేదీ : మార్చి 06, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, బేబీ ఊహ, సుదర్శన్ తదితరులు
దర్శకుడు : శ్రీ హుస్సేన్ షా కిరణ్
నిర్మాత : సందీప్ గుర్రం, వినయ్ చిలకపాటి
సంగీత దర్శకుడు : కాల భైరవ
సినిమాటోగ్రాఫర్ : విద్యా సాగర్ చింత
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
సంబంధిత లింక్స్ :ట్రైలర్
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు నటించిన ‘విష్ణు విన్యాసం’ విడుదలైన వారం రోజులకే ఇప్పుడు ‘మృత్యుంజయ్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందించారు. మరి ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ ప్రీమియర్ షో ఆధారంగా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
జయ్ అలియాస్ మృత్యుంజయ్ (శ్రీవిష్ణు) ‘స్వేచ్ఛ’ అనే వార్తాపత్రికలో పని చేస్తూ, మరణవార్తలకు సంబంధించిన యాడ్స్ కలెక్ట్ చేస్తుంటాడు. తన పనిలో దిట్ట అయినప్పటికీ, క్రైమ్ బ్యూరో విభాగంలో చేరాలనేది అతని లక్ష్యం. కానీ అనుభవం లేదన్న కారణంతో అతనికి ఆ అవకాశం దక్కదు. ఒకరోజు ఒక మరణవార్త యాడ్ కోసం వెళ్లిన జయ్‌కు ఆ మరణం వెనుక ఏదో తేడా ఉందనిపిస్తుంది. ఆ దిశగా అతను మొదలుపెట్టిన విచారణ అతన్ని ఒక పవర్‌ఫుల్ వ్యక్తి ఎదుట నిలబెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది..? అనేది ఈ చిత్ర కథ.
ప్లస్ పాయింట్స్:
శ్రీ విష్ణు ఇప్పటివరకు కామెడీ జోనర్ సినిమాలతో ప్రేక్షకులను నవ్వించడం చూశాం. అయితే, ఇప్పుడు సరికొత్తగా ఆయన తన జోనర్ మార్చి ఒక అద్భుతమైన పర్ఫార్మర్‌గా ‘మృత్యుంజయ్’ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో ఆయన తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.
ఇలాంటి సీరియస్ పాత్రలో నటిస్తూ శ్రీ విష్ణు ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని ఇచ్చాడు. ఒక వ్యక్తి చావుకి గల కారణాన్ని కనుక్కునేందుకు శ్రీవిష్ణు ఎందుకు ప్రయత్నిస్తున్నాడనే విషయాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు.
ఏదైనా సినిమాకు హీరోకు ఒక పవర్‌ఫుల్ విలన్ ఉంటే ప్రేక్షకుల్లో ఆ సినిమాపై మంచి ఆసక్తి క్రియేట్ అవుతుంది. ‘మృత్యుంజయ్’ సినిమాలో కూడా ఇదే జరిగింది. విలన్ పాత్రను రాసిన తీరు ఎంత బాగుందో వీర్ ఆర్యన్ పర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుంది. హీరోతో పాటు విలన్ కూడా చాలా తెలివిగా ఉండటం, సెకండాఫ్‌లో వీరి మధ్య సాగే మైండ్ వార్ ఆకట్టుకుంటుంది.
రెబా మోనికా జాన్ పోలీస్ పాత్రలో చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చివర్లో ఆమె చేసిన యాక్షన్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే ఇందులో ఎలాంటి రొమాంటిక్ ట్రాక్ లేకపోవడం.
మైనస్ పాయింట్స్:
‘మృత్యుంజయ్’ ఒక హానెస్ట్ అటెంప్ట్ అయినా కూడా కొన్ని లోపాల వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లలేదు. ముఖ్యంగా సినిమా ప్రారంభంలోని సీన్స్ ఈ చిత్రానికి ప్రధాన మైనస్ పాయింట్. కథను మొదలుపెట్టిన విధానం, హీరో నేపథ్యం మరియు అతని పాత్రను పరిచయం చేసిన తీరు అంతగా ఆకట్టుకోదు. ఫస్ట్ హాఫ్ చాలా క్యాజువల్‌గా సాగడంతో ప్రీ-ఇంటర్వెల్ పాయింట్ నుండే సినిమా అసలు వేగాన్ని పుంజుకుంటుంది.
సినిమా మొదటి గంటలో పేసింగ్ సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా శ్రీ విష్ణు మరియు అతని స్నేహితుల మధ్య వచ్చే సీన్స్ ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దాల్సింది. ఈ సినిమా ఎంచుకున్న పాయింట్ అంత కొత్తదేమీ కాదు. కాబట్టి, ఏదో వైవిధ్యమైన కథను ఆశించి థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులకు కొంత నిరాశ తప్పదు.
సాంకేతిక విభాగం:
కాల భైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. ఉత్కంఠ భరిత సన్నివేశాలను తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లాడు. విద్యా సాగర్ సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు శ్రీ హుస్సేన్ షా కిరణ్ హీరో, విలన్ మధ్య సాగే ‘టామ్ అండ్ జెర్రీ’ గేమ్‌ను చక్కగా హ్యాండిల్ చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ మీద మరికొంత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
తీర్పు:
ఓవరాల్‌గా చూస్తే.. ‘మృత్యుంజయ్’ ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను మెప్పిస్తుంది. శ్రీవిష్ణు కొత్త జోనర్ ఎంచుకోవడంతో పాటు తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటాడు. రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్ కూడా తమ పాత్రలతో మెప్పిస్తారు. సెకండాఫ్‌లో హీరో విలన్ మధ్య సాగే మైండ్ గేమ్ బాగుంటుంది. ఫస్ట్ హాప్ మాత్రం ఊహించిన స్థాయిలో లేకపోవడంతో ఓవరాల్ ఇంపాక్ట్‌పై ప్రభావం పడుతుంది. క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారు ఈ సినిమాను ఓ సారి ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team


