
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిది ఓ ప్రత్యేక శైలి. ప్రయోగాత్మక సినిమాలను కమర్షియల్‌గానూ వర్కవుట్ అయ్యేలా చేస్తూ ‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’ లాంటి వినూత్న సినిమాలను అందించిన యేలేటి, తాజాగా ఓ బహుభాషా సినిమాను సెట్స్‌పైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందనున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందనుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఓ ఫ్యామిలీ ఓరియంటడ్ కథాంశంతో సరికొత్త నెరేషన్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. ఇక స్క్రిప్ట్ పనులు పూర్తి కావచ్చాయని, త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళుతున్నామని నిర్మాణ సంస్థ తెలిపింది. ఇక మోహన్ లాల్‌తో ఈ ప్రాజెక్టు విషయమై సంప్రదింపులు జరిపే క్రమంలో ఆయనతో కలిసి తీయించుకున్న ఓ ఫోటోను సాయి కొర్రపాటి షేర్ చేస్తూ, మోహన్ లాల్‌తో కలిసి పనిచేయడం సంతోషాన్నిస్తోందని తెలిపారు.

