ప్రముఖ హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు. 1951 ఏప్రిల్ 16న పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. సంక్రాంతి సందర్భంగా భీమవరం వెళ్ళిన ఎమ్మెస్, అక్కడ అనారోగ్యం పాలయ్యారు. మలేరియా రావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. మధ్యలో ఓ సారి హార్ట్ ఎటాక్ వచ్చింది. నిన్నటి నుండి ఎమ్మెస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కిమ్స్ హాస్పిటల్ లో నేడు కన్ను మూశారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కుమార్తె శశి కిరణ్ నారాయణ ఇటివలే దర్శకురాలిగా పరిచయమయ్యారు. కుమారుడు విక్రమ్ హీరోగా కొన్ని సినిమాలలో నటించారు.
‘యమధర్మ రాజు యం.ఏ’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. అంతక ముందు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వద్ద అనేక సినిమాలకు రచయిత పని చేశారు. కుమారుడు విక్రమ్ హీరో తెరకెక్కిన ‘కొడుకు’ సినిమాకు దర్శకత్వం వహించారు. నటుడిగా సుమారు 700పైగా చిత్రాలలో నటించారు. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. తాగుబోతు పాత్రలకు ఎమ్మెస్ నారాయణ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. పలు సినిమాలలో తాగుబోతు పాత్రలలో తనదైన శైలి నటనతో ప్రేక్షకులకు వినోదం పంచారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో ఎమ్మెస్ కామెడీ కంపల్సరీ అయిపొయింది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో ఎమ్మెస్ నటిస్తున్నారు.
ఎమ్మెస్ నారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు 123తెలుగు.కామ్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది.


