రాఘవ లారెన్స్ మొదట కొరియోగ్రాఫర్ గా చేసి, ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా మారి తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. రాఘవ లారెన్స్ కి దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘ముని’. హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కాంచన’ తీసాడు. అది కూడా పెద్ద హిట్ అయ్యింది. దాంతో ప్రస్తుతం ఈ రెండింటికి సీక్వెల్ గా ‘ముని 3 – గంగ’ని తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.
మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. దాంతో రాఘవ లారెన్స్ గత కొద్ది రోజులుగా ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 19న రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకాస్త సమయం పట్టేలా ఉండడం తో ఈ చిత్ర టీం ఒక వారం వెనక్కి వెళ్లి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
రాఘవ లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఐదు మంది సంగీత దర్శకులు కలిసి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


