‘లౌక్యం’ ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించబోయే 99వ సినిమాకు సంగీత దర్శకుడు కన్ఫర్మ్ అయ్యారు. యువ సంగీత సంచలనం తమన్ తొలిసారిగా బాలకృష్ణ సినిమాకు సంగీతం అందించే అవకాశం సొంతం చేసుకున్నాడు. బాలయ్య 99వ సినిమాకు తానే సంగీతం అందిస్తున్నట్టు ప్రముఖ దిన పత్రిక ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ తెలిపారు. ఈ సినిమాకు కోన వెంకట్, గోపి మోహన్ లు కథ అందిస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయ్యిందని, అద్బుతంగా వచ్చిందని ఇటీవల కోన వెంకట్ ట్విట్టర్లో తెలిపారు.
అతి తక్కువ సమయంలో అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగిన తమన్, తెలుగు చిత్ర సీమలో టాప్ హీరోలైన వెంకటేష్, నాగార్జునలతో పాటు యంగ్ సూపర్ స్టార్స్ మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్, నాగ చైతన్య తదితరుల సినిమాలకు సంగీతం అందించారు. తాజాగా బాలకృష్ణ సినిమాకు అవకాశం రావడంతో సీనియర్ హీరోలు అందరినీ కవర్ చేసినట్టు అయ్యింది. యువతకు మంచి కిక్ ఎక్కించే పాటలకు సంగీతం అందించడంలో తమన్ సుప్రసిద్దుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రవితేజ ‘కిక్ 2’, రామ్ ‘పండగ చేసుకో’, సందీప్ కిషన్ ‘బీరువా’ సినిమాలకు స్వరాలు సమకూర్చడంలో బిజీగా ఉన్నారు.


