ఇంటర్వ్యూ: స్వప్న దత్, ప్రియాంక దత్ : నాగికి సావిత్రిగారంటే చాలా ఇష్టం.. అందుకే ఈ సినిమా చేశాడు !

ఇంటర్వ్యూ: స్వప్న దత్, ప్రియాంక దత్ : నాగికి సావిత్రిగారంటే చాలా ఇష్టం.. అందుకే ఈ సినిమా చేశాడు !

Published on May 4, 2018 4:22 PM IST

ఈ నెల 9వ తేదీన ‘మహానటి’ చిత్రం విడుదలకానున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నిర్మాత అశ్విని దత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు నిర్మించారు. చిత్ర విడుదల సందర్బంగా వారు మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు మీకోసం..

స్వప్న దత్ గారు చెప్పండి సినిమా ఎలా వచ్చింది ?
సినిమా చాలా బాగా వచ్చింది. నిన్ననే చూశాం. ఔట్ ఫుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం.

ప్రియాంకగారు అసలు సావిత్రి బయోపిక్ తీయాలనే ఆలోచన నాగ్ అశ్విన్ గారికి ఎలా వచ్చింది ?
నాగికి సావిత్రిగారంటే చాలా ఇష్టం. ఆమెకు వీరాభిమాని. ఆ అభిమానంతోనే ఈ సినిమా చేశారు.

ఆయన ఈ సినిమా గురించి మొదటిసారి మీకు చెప్పగానే ఎలా ఫీలయ్యారు ?
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాకి ముందే ఈ సినిమాను తన రెండో చిత్రంగా తీయాలని అశ్విన్ అనుకున్నారు. ఆ ప్రకారమే చేశారు. మొదట ఈ సినిమా గురించి చెప్పగానే తేరుకోవడానికి మాకు రెండు రోజులు పట్టింది.

స్వప్నగారు సావిత్రిగారి పాత్ర కోసం కీర్తి సురేష్ కరెక్ట్ ని ఎప్పుడు అనుకున్నారు ?
ముందుగా ఈ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లను అనుకున్నాం. కానీ ఎవరూ కుదరలేదు. ఒకరోజు నాగి కీర్తి సురేష్ అయితే ఎలా ఉంటుందని అన్నాడు. అతని డెసిషన్ కి కన్విన్స్ అవడానికి మాకు నెల పట్టింది.

కీర్తితో ఈ సంగతి చెప్పగానే ఎలా ఫీలయ్యారు ?
ఆమెకు మేము చెప్పడానికంటే ముందే ఈ విషయం తెలిసిపోయి ఎగిరి గంతేసినంత పనిచేశారు. మేము అడగ్గానే ఒప్పేసుకున్నారు. కానీ ఆ తర్వాత అంత పెద్ద పాత్రకు చేయగలనో లేదో అని కంగారుపడ్డారు కూడ.

కథను ఎలా సిద్ధం చేసుకున్నారు ?
సినిమా అనుకున్న వెంటనే అన్నీ పక్కనబెట్టి ముందు కథను రెడీ చేసే పనిలో పడ్డాం. అందుబాటులో ఉన్న అన్ని సోర్సులను వాడుకున్నాం. సావిత్రిగారి గురించి మాట్లాడటానికి ఇష్టపడే వారందరూ మాకు కథ పరంగా సహాయం చేశారు.

సినిమాలో చాలా మంది సీక్రెట్ స్టార్స్ ఉన్నారని విన్నాం.. వాళ్లెవరో చెప్తారా ?
అది 9వ తేదీన విడుదలకాబోయే సినిమాను చూసే తెలుసుకోవాలి. ముందుగానే అన్నీ చెప్పేస్తే ఆ థ్రిల్ పోతుంది.

నాగ్ అశ్విన్ గురించి చెప్పండి ?
నాగికి సినిమా పట్ల చాలా విజన్ ఉంది. ఆ విజన్ వల్లనే ఈ సినిమా సాధ్యమైంది. అనుక్షణం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.

సావిత్రిగారి పిల్లలు ఈ సినిమా చూసి ఎలా ఫీలయ్యారు ?
వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పలేం. అమ్మా నాన్నలను మళ్ళీ చూసుకున్నట్టు ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు.

కథ పరంగా వాళ్ళేమైనా షరతులు పెట్టారా ?
లేదు. వాళ్ళసలు కథలో ఇన్వాల్వ్ కాలేదు. కథకి కావాల్సిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు వాళ్ళు.

సినిమాలో ఎవరికి ఎక్కువ పేరొస్తుంది ?
సావిత్రిగారి పాత్ర చేసిన కీర్తి సురేష్ కు మంచి పేరొస్తుంది. ఆ తర్వాత మధురవాణి పాత్ర చేసిన సమంతగారికి కూడ బాగా పేరొస్తుంది.

మీ టెక్నికల్ టీమ్ గురించి చెప్పండి ?
సినిమాటోగ్రఫర్ డానీ చాలా మంచి వర్క్ చేశాడు. సినిమాను ఫిల్మ్ కెమెరాతో షూట్ చేశాం. చాలా బాగా వచ్చింది. అలాగే మిక్కీ జే మేయర్ అంధించిన సంగీతం కూడ చాలా గొప్పగా ఉంది. టీమ్ విషయంలో మాది మంచి ఛాయిస్ అయింది.

ఇకపై ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు ?
మాకు సినిమాలంటే మంచి అభిరుచి ఉంది. బిజినెస్ పరంగా కాకుండా ఇంకో పదేళ్లలో అందరికీ గుర్తుండిపోయే నాలుగు మంచి సినిమాలు చేస్తే చాలనేది మా ఉద్దేశ్యం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు