
ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తూ మెప్పించే స్టార్స్‌లో నాగార్జున చాలా ముందుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘ఊపిరి’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలూ షూటింగ్ చివరిదశకు చేరుకున్నాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోన్న ‘సోగ్గాడే చిన్న నాయనా’ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతోంది.
కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను నాగార్జున స్వయంగా తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న మైసూర్ షెడ్యూల్‌తో షూటింగ్ దాదాపుగా పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక అఖిల్ ఆడియో ఫంక్షన్ కోసం ఈ షెడ్యూల్‌కు చిన్న గ్యాప్ ఇచ్చిన నాగార్జున, నేడు మళ్ళీ మైసూర్ పయనమయ్యారు. మరో పదిరోజుల పాటు నిరవధికంగా షూటింగ్ జరగనుంది. ఇప్పటికే నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.