బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డుకు ఎంపికైన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ సినిమా ఆధారంగా ‘లాల్ సింగ్ ఛద్దా’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ స్నేహితుడి పాత్ర కోసం మొదట తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తీసుకున్నారు. కానీ సేతుపతికి డేట్స్ క్లాష్ రావడంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దీంతో ఆ పాత్రకు దక్షిణాది నటుడైతేనే బాగుంటుందని నిర్ణయించుకున్న ఆమిర్ ఖాన్ నాగ చైతన్యకు ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
నాగ చైతన్య ఆ సినిమా చేయడానికి అంగీకరించారని, మే నుండి షూటింగ్లో పాల్గొంటారని, సింగిల్ షెడ్యూల్లో ఆయన పాత్ర తాలూకు షూటింగ్ ముగుస్తుందని అంటున్నారు. అదే గనుక వాస్తవమైతే నాగ చైతన్యకు బాలీవుడ్లోకి మంచి ఎంట్రీ దొరికినట్టే. అంతేకాదు ఆమిర్ ఖాన్ లాంటి పర్ఫెక్షనిస్ట్ తో కలిసి పనిచేసిన అనుభవం చైతన్యకు బాగా ఉపయోగపడుతుంది కూడ. ఇకపోతే ఇందులో ఆమిర్ ఖాన్ సరసన కరీనా కపూర్ నటిస్తోంది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.


