టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నాగబంధం’ విడుదలకు ముస్తాబవుతోంది. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రతి ప్రచార చిత్రంలోనూ కనిపిస్తున్న విజువల్ గ్రాండియర్, సినిమా స్కేల్‌ను తెలియజేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ ప్రాజెక్ట్ పట్ల విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది.
ఇక ట్రేడ్ వర్గాల్లో ‘నాగబంధం’ ప్రీ-రిలీజ్ బిజినెస్ సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్ర నాన్-థియేట్రికల్ హక్కులు రికార్డు ధరలకు అమ్ముడుపోగా, నార్త్ ఇండియా మరియు ఓవర్సీస్ పంపిణీ బాధ్యతలను జీ స్టూడియోస్ దక్కించుకుంది. తాజాగా నైజాం ఏరియా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ. 9 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకోవడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ డీల్ సినిమా కంటెంట్ మరియు కమర్షియల్ సక్సెస్‌పై పరిశ్రమకు ఉన్న నమ్మకానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం కోసం మేకర్స్ దేశవ్యాప్తంగా మల్టీ-సిటీ ప్రమోషనల్ టూర్‌ను ప్లాన్ చేశారు. సినిమా గ్రాండియర్‌కు తగ్గట్టుగానే దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. థియేటర్లలోకి రాకముందే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా ఈ టూర్‌ను డిజైన్ చేశారు. అంతేకాకుండా, జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం జూలై 2నే ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


