ముఖ్య అంశాలు
- ఢిల్లీ క్యాపిటల్స్ విసిరిన 265 పరుగుల భారీ టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ కేవలం 18.5 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించి చరిత్ర సృష్టించారు.
- కేఎల్ రాహుల్ (152), నితీశ్ రాణా (91) వీరబాదుడుతో ఢిల్లీ 264 పరుగుల భారీ స్కోరు సాధించినా సొంత గడ్డపై పరాజయం తప్పలేదు.
- పంజాబ్ బ్యాటర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76), శ్రేయస్ అయ్యర్ (71) సిక్సర్ల వర్షం కురిపించి ఈ అసాధారణ విజయాన్ని అందించారు.
టి20 క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు చూశాం.. కానీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ వాటన్నింటినీ దాటేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన 35వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఏకంగా 265 పరుగుల కొండంత టార్గెట్‌ను ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే ఊదేసి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. ఈ దెబ్బతో ఢిల్లీ క్యాపిటల్స్ సొంత గడ్డపై కంగుతిన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు మొదటి నుంచే పంజాబ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ పూనకం వచ్చినట్లు శివమెత్తారు. కేవలం 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 పరుగులు బాది ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. మరోవైపు నితీశ్ రాణా సైతం 44 బంతుల్లో 91 పరుగులతో రెచ్చిపోయారు. వీరిద్దరి వీరవిహారంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఈ స్కోరు బోర్డు మీద చూశాక పంజాబ్ పని అయిపోయిందని, ఢిల్లీ విజయం ఖాయమని సగటు అభిమాని ఫిక్స్ అయ్యారు.
కానీ, అసలు మ్యాజిక్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదలైంది. పంజాబ్ ఓపెనర్లు తొలి బంతి నుంచే విధ్వంసం మొదలుపెట్టారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ కేవలం 26 బంతుల్లో 5 సిక్సర్లు, 9 ఫోర్లతో 76 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగెత్తించారు. మరో ఎండ్‌లో ప్రియాంశ్ ఆర్య (17 బంతుల్లో 43) కూడా వేగంగా ఆడి బలమైన పునాది వేశారు. వీరు ఇచ్చిన స్టార్ట్‌తో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 71) ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఏకంగా ఏడు సిక్సర్లు బాది టార్గెట్‌ను కరిగించారు. చివర్లో శశాంక్ సింగ్ (10 బంతుల్లో 19), నేహాల్ వధేరా (15 బంతుల్లో 25) ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా బ్యాట్ ఝుళిపించారు.
దీంతో కేవలం 18.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 265 పరుగులు సాధించిన పంజాబ్ కింగ్స్ ఏకంగా 6 వికెట్ల తేడాతో చరిత్రాత్మక విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. అసాధ్యం అనుకున్న టార్గెట్‌ను అలవోకగా ఛేదించి పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ఇటు అద్భుతమైన సెంచరీ సాధించినా కేఎల్ రాహుల్ కష్టానికి మాత్రం ఫలితం దక్కకుండా పోయింది.


