ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్‌లో సంచలనం సృష్టించి, ఇప్పటికీ నెంబర్ వన్ పొజిషన్ నిలబడిన సంస్థ గూగుల్. అమెరికా కేంద్రంగా స్థాపితమైన ఈ సంస్థకు తాజాగా భారత సంతతికి చెందిన సుందర్ పిచ్చై సీయీఓగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఓ భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత సంస్థకు సీయీఓగా ఎంపిక కావడం పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీతో పాటు సినీ, వ్యాపార, రాజకీయ ఇలా అన్ని రంగాల ప్రముఖుల దగ్గర్నుంచి సుందర్‌కు అభినందలు వెల్లువెత్తాయి.
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా తానేంటో నిరూపించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్, సుందర్‌కు ఈ సందర్భంగా తన అభినందనలు తెలియజేశారు. “ఒక భారత సంతతి వ్యక్తి గూగుల్ సంస్థకు సీయీఓగా నిలవడం గొప్ప విషయం. మీ ఇన్స్పిరేషన్‌తో భారతదేశంలోని యువత లక్ష్యం వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నా” అని తెలిపారు. ఇక కళ్యాణ్ రామ్ కూడా అమెరికాలో చదివి కార్పొరేట్ ప్రపంచాన్ని దగ్గరగా చూసి ఉన్నారు. ఇక సుందర్ పిచ్చై 2004లో గూగుల్ సంస్థలో చేరి నేడు దానికి సీయీఓగా పనిచేసే స్థాయికి ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచారు.


