టక్ జగదీష్‌లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి – నేచుర‌ల్ స్టార్ నాని

Published on Sep 1, 2021 9:41 pm IST


నేచురల్ స్టార్ నాని హీరోగా, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘టక్ జగదీష్’. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గారపాటి, హ‌రీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను విడుద‌ల‌ చేశారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఫ్యామిలీ ఎమోషన్సే శివ నిర్వాణ బలం అని, నిన్నుకోరి, మజిలి సినిమాలను చూస్తే ఆ విషయం తెలుస్తుందని అన్నారు. ఆ రెండు సినిమాల్లో ఇద్దరి ముగ్గురు మధ్యే ఎమోషన్స్ ఉంటాయని, కానీ టక్ జగదీశ్‌లో మాత్రం చాలా మంది మధ్య ఎమోషన్స్ చూపించేశారని, ఇప్పటికే ట్రైలర్ చూసిన వారి కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు. థియేటర్‌లో కాకుండా సినిమాను ఓటీటీ విడుదల చేయడంపై కొంత మంది కొన్ని రకాల కామెంట్లు చేశారని, వారంతా నాకంటే పెద్దవాళ్లు. వారున్న పరిస్థితుల్లో అలా మాట్లాడటంలో తప్పులేదని అన్నారు. టక్ జగదీష్‌లో అన్నదమ్ముల రిలేషన్ మధ్య ఉండే ఆ కాంప్లెక్సిటీని దర్శకుడు మొదటగా చెప్పాడు. కథ చెప్పినప్పుడు నచ్చిన పాయింట్ అదే అని, రిలేషన్ షిప్‌లో ఉన్న కాంప్లెక్సిటీని మనం ఈ మధ్య మిస్ అవుతున్నామని, శివ నిర్వాణ తాను నిజ జీవితంలో చూసిన పాత్రలన్నీ కూడా ఇందులో పెట్టేశారని అన్నారు. ఈ సినిమా మన పాత రోజుల్లోకి తీసుకెళ్లేలా ఉంటుందని, ఏదైనా సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది.. కానీ మన ఇంట్లో మాత్రం అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. టక్ జగదీష్ కూడా మన ఇంటి సినిమా. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని అన్నారు.

నిన్నుకోరితో ఇది వరకే శివ నిర్వాణతో కలిసి పని చేశానని, రీతూ వర్మతో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కలిసి చేశానని, ప్రవీణ్ అయితే నా కెరీర్ ప్రారంభం నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నామని అన్నారు. తిరువూర్ అద్భుతమైన నటుడని, ఇంత వరకు ఆయన నటించిన సినిమాలు చూడలేదని, ఆయన పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అన్నారు. సినిమాను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడం లేదనే సమస్యే ఉండదని, అన్ని కోణాల్లో సినిమా గురించి ఆలోచించాలని అన్నారు. ఈ సినిమాను థియేటర్లో అందరితో కలిసి చూడాలని ఎంతో అనుకున్నానని, కానీ బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నామని, బయటి పరిస్థితులు త్వరగా చక్కబడాలి. మళ్లీ ఆ పూర్వ వైభవం రావాలి. బ్రేకుల్లేకుండా మీ అందరినీ కలుసుకోవాలని అనుకుంటున్నానని అన్నారు.

ద‌ర్శ‌కుడు శివనిర్వాణ మాట్లాడుతూ చాలా మందికి థ్యాంక్స్ అని, ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని అన్నారు. రెండేళ్ల శ్రమ ఇదని, థియేటర్‌లో సినిమా విడుదల కావడం లేదని తెలిసినప్పుడు బాధ కలిగిందని అది నాకు, నానికి మాత్రమే తెలుసని అన్నారు. ఈ సినిమాను నాని థియేటర్ డోర్ వద్ద రెండున్నర గంటలు వెయిట్ చేసి నిల్చుని చూస్తాడని, అక్కడి నుంచి అయితే అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుస్తుందని, నాని ఎప్పుడూ కూడా తన సినిమాలను అలానే చూస్తాడని అన్నారు. షైన్ స్క్రీన్‌తో తాను రెండో సినిమా చేస్తున్నానని, నా డబ్బులే పెట్టి సినిమా తీస్తున్నానన్న ఫ్రీడం నాకు ఉంటుందని, పరిస్థితులు మారడం లేదనే సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని, ఏమైనా తేడా వస్తే నాని, నా రెమ్యూనరేషన్‌లోంచి కట్ చేసుకోమ్మని చెప్పామని, మా సినిమా అమెజాన్ ద్వారా ప్రతీ ఊర్లోకి వెళ్తోంది. వినాయక చవితి నాడు మా సినిమాను ఊర్లో వాళ్లు కూడా చూస్తారని, వినాయకచవితి నాడు టక్ జగదీష్ సినిమా అదిరిపోతుందని అన్నారు.

కమెడియన్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారి పాత్రలో నేను నటిస్తున్నానని, ఆ పాత్ర గురించి దర్శకుడు అన్ని క్లియర్‌గా చెప్పారని అన్నారు.

హీరోయిన్ రీతు వ‌ర్మ మాట్లాడుతూ ఈ సినిమాలో గుమ్మ పాత్రను పోషించడం ఆనందంగా ఉందని, థియేటర్‌లో విడుదల కావడం లేదనే బాధ నాకు కూడా ఉందని, పండుగ రోజు కుటుంబం అంతా కలిసి చూడటానికి ఇది కరెక్ట్ సినిమా అని అన్నారు

నటుడు తిరువీర్ మాట్లాడుతూ శివ నిర్వాణ టీంను చూస్తేనే పండుగలా ఉంటుందని, తెలుగు కుటుంబాలు అందరూ కూడా చూసేందుకు సరైన సినిమా అని అన్నారు.

సంబంధిత సమాచారం :