
‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’, ‘రౌడీఫెలో’ లాంటి డిఫరెంట్ మూవీస్‌తో అలరించిన నారా రోహిత్ తాజాగా మరో డిఫరెంట్ మూవీ ‘అసుర’ ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘అసుర’ విజయం తర్వాత తనను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసే సినిమాలను ఎంచుకుంటూ నారా రోహిత్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ కోవలో ఇప్పటికే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే రియల్ లైఫ్ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తుండగా తాజాగా ‘సావిత్రి’ అనే మరో సినిమాకు శ్రీకారం చుట్టారు.
నారా రోహిత్ నటించే ‘సావిత్రి’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఈ ఉదయమే హైద్రాబాద్‌లో జరిగింది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో మెప్పించిన దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో సావిత్రి తెరకెక్కనుంది. విజన్ ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బి.రాజేంద్రప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, శ్రవణ్ సంగీతం సమకూరుస్తున్నారు.
‘సావిత్రి’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారారోహిత్, శ్రీవిష్ణు, బెక్కం వేణుగోపాల్, దర్శకుడు పవన్ సాధినేని తదితరులు పాల్గొన్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నారా రోహిత్ రోల్ హైలైట్ గా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు అన్నారు. హీరోయిన్ సహా మిగతా ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు.