
సినిమా సినిమాకూ కొత్తదనాన్ని చూపిస్తూ వైవిధ్యభరితమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్ నటించిన తాజా చిత్రం ‘అసుర’. గత శుక్రవారమే విడుదలైన ఈ సినిమా మంచి టాక్, కలెక్షన్లతో దూసుకుపోతోంది. ‘అసుర’ విడుదలైన రెండు రోజుల్లోపే నారా రోహిత్ మరో సినిమాను మొదలుపెట్టేశారు. ‘అయ్యారే’ సినిమాతో మంచి దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న సాగర్ చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూర్తిగా హైద్రాబాద్ నేపథ్యంలో నడిచే సినిమా అని తెలుస్తోంది. 1992-96 ప్రాంతంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘ప్రేమా ఇష్క కాదల్’ ఫేమ్ శ్రీ విష్ణు ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ ఉదయం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

