Netflix in Hyderabad: నెట్‌ఫ్లిక్స్ రాకతో భాగ్యనగరంలో మారనున్న సినిమా రేంజ్!

Netflix in Hyderabad: నెట్‌ఫ్లిక్స్ రాకతో భాగ్యనగరంలో మారనున్న సినిమా రేంజ్!

Published on Mar 12, 2026 3:00 PM IST

revenr

గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మారుతున్న హైదరాబాద్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి చేరింది. ప్రపంచ ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) భాగ్యనగరంలో ఏకంగా ఒక గ్లోబల్ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కేంద్రాన్ని లాంచ్ చేసింది. సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ ‘ఐలైన్ స్టూడియోస్’ (Eyeline Studios) వర్చువల్ ప్రొడక్షన్ హబ్‌ను ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టెక్నాలజీపై, విజువల్ ఎఫెక్ట్స్‌పై రానాకు ఉన్న ఆసక్తి తెలిసిందే. ఇలాంటి ఒక గ్లోబల్ స్టూడియో హైదరాబాద్‌కు రావడం పట్ల సినీ ప్రముఖులు, నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

“హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్లే..”

నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు రావడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి అమితానందం వ్యక్తం చేశారు. “నెట్‌ఫ్లిక్స్ మన నగరానికి వచ్చిందంటే.. సాక్షాత్తూ హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే” అని ఆయన అభివర్ణించారు. తనకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పిన సీఎం.. టెక్నాలజీతో పాటు సినిమా రంగంలోనూ హైదరాబాద్ శరవేగంగా దూసుకుపోతోందని గుర్తుచేశారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే అంతర్జాతీయ సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో నెట్‌ఫ్లిక్స్ తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తే కావాల్సిన భూమిని, మౌలిక వసతులను కల్పిస్తామని సీఎం బంపర్ ఆఫర్ ఇచ్చారు.

దేశంలో ముంబై తర్వాత నెట్‌ఫ్లిక్స్‌కు ఇదే రెండో అతిపెద్ద కార్యాలయం కావడం విశేషం. ఈ స్టూడియో రాకతో తెలంగాణలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (AVGC) రంగం దశ తిరగనుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హాలీవుడ్ స్థాయి వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఇప్పుడు నేరుగా హైదరాబాద్‌లోనే అందుబాటులోకి రానుంది. దీనివల్ల సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం ఉన్న స్థానిక యువతకు ఎన్నో కొత్త గ్లోబల్ ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు