సూపర్‌స్టార్ రజనీకాంత్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జైలర్ 2’ షూటింగ్‌కు సంబంధించి ఒక తాజా వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్ రఫ్ కట్ చూసిన చిత్ర బృందం సంతృప్తిగా లేకపోవడంతో, దాదాపు నెల రోజుల పాటు కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేయాలని నిర్ణయించింది. 2023లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘జైలర్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ఈ ఆలస్యం అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది.
మొదటి భాగంలో రజనీకాంత్‌ను రొటీన్ మాస్ ఎలివేషన్స్ కాకుండా, చాలా సింపుల్‌గా చూపిస్తూనే కథను సహజ సిద్ధమైన యాక్షన్ ఎపిసోడ్స్‌తో నడిపించారు. అయితే సీక్వెల్‌లోని కొన్ని సీన్స్ ఆ సహజత్వానికి దూరంగా, కాస్త అతిగా అనిపించడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే మొదటి భాగం లాగే రియలిస్టిక్ స్టైల్‌ను మ్యాచ్ చేయడం కోసం ముఖ్యమైన యాక్షన్ సీన్స్‌ను రీషూట్ చేయనున్నారు. సినిమా అవుట్‌పుట్ పక్కాగా రావాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేస్తున్నారు.
ఈ రీషూట్ కారణంగా సినిమా విడుదల తేదీ మరింత ముందుకు జరగనుంది. నిజానికి ఈ చిత్రం 2026 సెప్టెంబర్‌లో విడుదలవుతుందని ప్రచారం జరిగినప్పటికీ, తాజా మార్పుల వల్ల 2026 దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెలల తరబడి ఎదురుచూస్తున్న టీజర్ కూడా ఇంకా రాకపోవడంతో ఆడియన్స్ నిరుత్సాహపడుతున్నా, ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయమని, ఈ సుదీర్ఘ నిరీక్షణకు తగిన ప్రతిఫలం దక్కుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.


