
విభిన్న చిత్రాల ద్వారా, విభిన్న పాత్రల ద్వారా దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా నిలిచే నటుడు.. కమల్ హాసన్. ఆయన హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ఉత్తమ్ విలన్.. ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమౌతోంది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 2నే విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కొన్ని అనివార్య కారణాల వలన విడుదల తేదీ వాయిదా పడింది. ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, దర్శకుడు లింగుస్వామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే కమల్ హాసనే సమకూర్చడం విశేషం. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ విభిన్నంగా కనిపిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాను తెలుగులో సి. కళ్యాణ్ విడుదల చేస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం కమల్.. ఏపీ, తెలంగాణాల్లోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ చేయని రీతిలో ఒక డబ్బింగ్ సినిమా ప్రమోషన్‌ను భారీ స్థాయిలో జరపనున్నారు. ఇదిలా ఉంటే.. కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘విశ్వరూపం 2’ సినిమా పరిస్థితేంటన్నది తాజా ప్రశ్న. కమల్ ప్లాన్ ప్రకారం రెండు వారాల తేడాలో ‘ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం 2’ విడుదల కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ‘ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం 2’ విడుదల తేదీల మధ్య రెండు మూడు రోజులే ఉండడం ఆసక్తికర అంశం. ‘ఉత్తమ విలన్’ వాయిదాతో ‘విశ్వరూపం 2’ కూడా వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది. ఏప్రిల్ 13న ‘విశ్వరూపం 2’ విడుదల చేయాలని ముందు నుంచే ప్లాన్ చేశారు.

