
సినిమా సినిమాకి కథలోనే కాకుండా, తన లుక్ విషయంలో కూడా కొత్త దానం చూపిస్తూ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్. ప్రస్తుతం నిఖిల్ అమెరికాలో తన తదుపరి సినిమా ‘శంకరాభరణం’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. క్రైమ్ కామెడీ జోనర్ లో న్యూ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో నిఖిల్ అమెరికాకి చెందిన ఓ ఎన్నారైగా కనిపించనున్నాడు. అమెరికా నుండి ఇండియాకి వచ్చిన ఓ కుర్రాడు బీహార్ నేపధ్యంలో ఉన్న కొంతమంది బందిపోటుల చేతిలో ఎందుకు ఇరుక్కుపోయాడు అనే అంశం చుట్టూ ఈ కథ ఉండనుంది.
గత కొద్ది రోజులుగా నిఖిల్ పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. ప్రస్తుతం నిఖిల్ పై వచ్చే స్టైలిష్ ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. నిఖిల్ సరసన నందిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ – డైలాగ్స్ ని అందించాడు. ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమాకు ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత. ఈ సినిమాలో ఓ బీహారీ గ్యాంగ్ కి అధినేతగా అంజలి ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందని సమాచారం.