POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన మ్యూజికల్ లవ్ డ్రామా ‘నిలవే’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించిన ఈ చిత్రంలో సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ, సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించారు.
శ్రేయాసి సేన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, జీవన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సరికొత్త కథాంశం, భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
సాంకేతిక వర్గం విషయానికి వస్తే, కళ్యాణ్ నాయక్ సంగీతం, దిలీప్ కే కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. ఎమ్‌వి.ఎస్. భరద్వాజ్ గీత రచన చేయగా, సత్య.జి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. కంటెంట్ పరంగా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించేందుకు ‘నిలవే’ సిద్ధంగా ఉందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.


