‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’ సినిమాలు ఘన విజయాలు సాధించడంతో నితిన్ సినిమా అంటే ప్రేక్షకులలో ఓ ఆసక్తి ఏర్పడింది. వరుస ప్లాపుల తర్వాత ఒక్కసారిగా స్టార్ హీరోగా అవతరించారు. ప్రతి సినిమాలో సరికొత్త ప్రేమకథతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. హట్రిక్ హిట్స్ తర్వాత ఈ యువహీరో నటించిన తాజా ప్రేమకధా చిత్రం ‘చిన్నదాన నీ కోసం’. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వం వహించారు. మిస్త్రీ చక్రవర్తి హీరోయిన్. శ్రేష్ఠ మూవీస్ పతాకంపై నితిన్ సోదరి నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలు తెలియజేయడానికి మీడియాతో సమావేశం అయ్యారు నితిన్. ఆ విశేషాలు మీకోసం..
ప్రశ్న) ‘చిన్నదాన నీ కోసం’ సినిమా ఎటువంటి తరహా ప్రేమకథ..?
స) కరుణాకరన్ శైలిలో సాగిపోయే ఓ అందమైన ప్రేమకథ ఈ ‘చిన్నదాన నీకోసం’. కుటుంబ అనుబంధాలకు, ఆప్యాతలకు.. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన చక్కటి లవ్ స్టొరీ. చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సినిమాలో నా పేరు నితిన్. పవన్ కళ్యాణ్ అభిమానిగా నటించాను. క్లైమాక్స్ లో ప్రేక్షకులకు ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. అదేంటో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి .
ప్రశ్న) కరుణాకరన్ ను దర్శకుడిగా ఎంపిక చేసుకోవడానికి కారణం..?
స) దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఉంది. ఆర్టిస్టుల చేత కొత్తగా యాక్టింగ్ చేయిస్తారు. నా మొదటి సినిమా నుండి కరుణాకరన్ గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. 20 సినిమాల తర్వాత కుదిరింది. చాలా సంతోషంగా ఉంది.
ప్రశ్న) దర్శకుడిగా కరుణాకరన్ కన్ఫర్మ్ అయిన తర్వాత కథ రెడీ చేశారని ప్రచారం జరుగుతుంది..?
స) కరుణాకరన్ గారి దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక ఉన్నా, కథ చెప్పిన తర్వాతే సినిమా స్టార్ట్ చేశాం. కథ, స్క్రిప్ట్, బడ్జెట్ ఇలా అన్నీ ఓకే అనుకున్న తర్వాత సినిమాకి సైన్ చేశాను. 12 ప్లాపుల తర్వాత కథ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. చాలా జాగ్రత్తగా నా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాను. ఎవరితో సినిమా చేసినా ముందు కథ ముఖ్యం.
ప్రశ్న) హీరోయిన్ మిస్త్రీ చక్రవర్తి సెలక్షన్ ఎవరిదీ..? ఎలా నటించింది..?
స) ఈ సినిమాకి ఓ కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని కరుణాకరన్ భావించారు. తర్వాత మిస్త్రీ చక్రవర్తిని సెలెక్ట్ చేశారు. ఆయనే హిందీలో సుభాష్ ఘై ‘కాంచి’ సినిమా ద్వారా మిస్త్రీ హీరోయిన్ గా పరిచమైంది. ఆ సినిమాలో తన నటనకు మంచి పేరొచ్చింది. ‘చిన్నదాన నీకోసం’లో కూడా బాగా నటించింది. సాధారణంగా కరుణాకరన్ గారు, తన ప్రతి సినిమాలో హీరోయిన్లను అందంగా చూపిస్తారు. మిస్త్రీని కూడా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు. భవిష్యత్ లో టాప్ హీరోయిన్ అవుతుంది.
ప్రశ్న) నితిన్ సినిమాలకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపల్సరీ అయిపొయింది..?
స) ఈ సినిమాకు మొదట వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుందామని నేను భావించాను. వరుసగా అనూప్ తో నాలుగో సినిమా అంటే ఆడియన్స్ మొనాటనీ ఫీలవుతారని అనిపించింది. కానీ, కరుణాకరన్ గారు అనూప్ ను కావాలని తీసుకున్నారు. అతని సంగీతం అంటే ఇష్టమట. నా గత సినిమాల ఆడియో ఫ్లేవర్ ‘చిన్నదాన నీ కోసం’లో లేకుండా కొత్త మ్యూజిక్ ఇచ్చాడు. సూపర్ హిట్ ఆడియోను అందించాడు.
ప్రశ్న) వరుసగా హోం బ్యానర్ లో సినిమాలు చేస్తున్నారు. ఇతర నిర్మాణ సంస్థలలో నితిన్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా..?
స) ‘హార్ట్ ఎటాక్’, ‘కోరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాలు ఇతర నిర్మాణ సంస్థలలో చేసిన సినిమాలే. మంచి ప్రొడక్షన్ హౌస్ లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. నా మార్కెట్ వేల్యూ ఎంతో నాకు బాగా తెలుసు. హోం బ్యానర్ లో సినిమా చేయడం వలన బడ్జెట్, స్క్రిప్ట్ విషయాలలో జాగ్రత్త వహించడానికి ఆస్కారం ఉంటుంది. బడ్జెట్ ఎక్కువ కావడం వలన అధిక శాతం సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.
ప్రశ్న) ఇతర నిర్మాణ సంస్థలు నిర్మించే సినిమాల బడ్జెట్ విషయంలో కూడా జోక్యం చేసుకుంటారా..?
స) తప్పకుండా, మంచి సినిమాను హీరో మార్కెట్ పరిధిలో తీయడం ఎంత ముఖ్యమో.. మనతో సినిమా తీసిన నిర్మాతకు లాభాలు రావడం కూడా అంతే ముఖ్యమే. నిర్మాత లేకపోతే సినిమా లేదు. మనం ఎవ్వరూ ఇక్కడ ఉండము. అందుకే, ఇతర నిర్మాణ సంస్థలో సినిమా చేసినా బడ్జెట్ అదుపులో ఉండేలా చూసుకుంటాను. నిర్మాత శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుంటాను.
ప్రశ్న) అఖిల్ సినిమాకు ఎంత బడ్జెట్ పెడుతున్నారు..?
స) వివి వినాయక్, అఖిల్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాను భారి బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాం. అయినా, మా హీరో చాలా స్మార్ట్. నా మొదటి సినిమా అని ఎక్కువ బడ్జెట్ పెట్టొద్దు అని ముందు నుండి చెప్తున్నాడు.
ప్రశ్న) చాలా మంది నిర్మాతలు అఖిల్ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు, ఆ అవకాశం మీకు ఎలా లభించింది..?
స) వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ అఖిల్ మనసులో ఉంది. మొదట మేము వినాయక్ గారిని అప్రోచ్ అయ్యాం. మంచి కథతో నాగార్జున గారిని కలిశాం. కథ నచ్చడంతో సినిమా ఓకే అయ్యింది. నాగార్జున గారు, నాన్నగారు మంచి స్నేహితులు. అలాగే నేను, అఖిల్ కూడా. దాంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మించే అవకాశం మా శ్రేష్ఠ మూవీస్ కి లభించింది. గతంలో ‘యువకుడు’ సినిమాను మా రెండు ఫ్యామిలీలు కలసి నిర్మించారు.
ప్రశ్న) అఖిల్ సినిమాలో నాగార్జున, మీరు అతిధి పాత్రల్లో నటిస్తున్నారట..?
స) లేదండీ.. స్టార్టింగ్ టు ఎండింగ్ అఖిల్ వన్ మాన్ షో. ప్రస్తుతానికి సినిమాలో ఎవ్వరూ అతిధి పాత్రలు చేయడం లేదు. వినాయక్ గారికి అటువంటి ప్లాన్స్ ఏవైనా ఉంటే తర్వాత ఆలోచిస్తాం.
ప్రశ్న) ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది..?
స) ఆ సినిమా ఎప్పుడు విడుదలైనా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న ప్రేమకథలకు పూర్తి భిన్నమైన సినిమా. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. తెలుగు వెర్షన్ కి సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. తమిళంలో అక్కడి ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలన అక్కడ షూటింగ్ లేటయ్యింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. త్వరలో సినిమా విడుదలవుతుంది.
ప్రశ్న) రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది..?
స) ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా తర్వాత మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకో. నీ దర్శకత్వంలో సినిమా చేస్తాను అని హర్షవర్ధన్ కు చెప్పాను. ఓ పెద్ద సినిమా చేయాలా..? లేక చిన్న సినిమా చేయాలా..? సందిగ్ధంలో హర్షవర్ధన్ ఉన్నాడు. తను దర్శకత్వంలో నటించడానికి నేను రెడీ.
ప్రశ్న) మీ నెక్స్ట్ సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుంది..?
స) ఇంకా కమిట్ అవ్వలేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, నెక్స్ట్ సినిమా కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దామనుకుంటున్నాను. వరుసగా ప్రేమకథలు చేస్తూ వచ్చాను. తర్వాత సినిమాలో కమర్షియల్ హంగులు ఉండేలా ప్లాన్ చేస్తున్నాను. అంటూ ఇంటర్వ్యూను ముగించారు.


