త్రివిక్రమ్-నితిన్‌ల ‘అ.ఆ’ మొదలైంది..!

Trivakram-Nithin
మాటల మ్యాజిక్‌తో కట్టిపడేసే దర్శక రచయిత త్రివిక్రమ్, లవర్ బాయ్‌గా సూపర్ క్రేజ్ ఉన్న హీరో నితిన్‌ల కాంబినేషన్‌లో ‘అ..ఆ’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. నితిన్ సరసన సమంత మొదటిసారి హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమా నేడు హైద్రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంచనంగా ప్రారంభమైంది. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఇలా రెండు సూపర్ హిట్ సినిమాల తర్వాత హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్ ‘అ ఆ’ అనే సినిమాతో త్రివిక్రమ్‌తో మూడో సారి జతకట్టడం విశేషంగా కనిపిస్తోంది.

హీరో నితిన్, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణల సమక్షంలో అ ఆ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తన ప్రతి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేసే దర్శకుడు త్రివిక్రమ్, ఈ సినిమాను కూడా ఓ ప్రేమకథకు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ‘అ ఆ’ అనే టైటిల్, ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ అన్న ట్యాగ్‌లైన్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే మంచి క్రేజ్ కనబడుతోంది. నితిన్ సరసన మరో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించనున్నారు.

Exit mobile version