
ఇప్పుడు ఎక్కడ చూసిన సాధారణంగా జరిగే చర్చల్లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు.. ‘బాహుబలి’. యావత్ దేశం ఓ సినిమా గురించి ఇంతలా మాట్లాడుకున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో మరే సినిమా విషయంలోనూ జరగలేదు. ఇండియన్ సినిమా గ్రాఫిక్స్, ఆర్ట్ వర్క్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఈ సినిమా గ్రాఫిక్స్ పరంగా ఒక ట్రెండ్ సెట్ చేసింది. దీంతో భారీ విజువల్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో తెరకెక్కే ఏ సినిమా విడుదలైన దాన్ని ‘బాహుబలి’ రేంజ్‌తో కొలిచే అవకాశాలెక్కువ. ఆ క్రమంలో తమిళ క్రేజీ ప్రాజెక్టుకు, బాహుబలికి ఇప్పటికే పోలికలు మొదలుపెట్టేశారు.
తమిళంలో సుమారు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘పులి’ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆగష్టు 2న చెన్నైలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ విశేషాలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పులి నిర్మాతలు మాట్లాడుతూ.. ‘పులి’ సినిమాకు, ‘బాహుబలి’ సినిమాకు పోలిక తెలేమని, రెండూ వేటికవే డిఫరెంట్ సినిమాలని తెలిపారు. గ్రాఫిక్స్ పరంగానూ ‘పులి’ని ‘బాహుబలి’తో పోల్చకూడదని నిర్మాతలు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.

